Monday, January 12, 2009

మహమ్మదు జీవితం – 1

ఈ భాగంలో మహమ్మదు పుట్టుకకు ముందు అరేబియాలో పరిస్థితులగురించి, మరియు బాల్యం గురించి వివరిస్తాను (నేను పూర్తిగా Life of Mahomet – William Muir పుస్తకంలో నుంచి వ్రాస్తాను). నేను చదివిన పుస్తకం వ్రాసిన ముయిర్ ఖురాను, హాడిత్ (ఇబ్న్-ఇషాఖ్, ఆల్-తబరి, ఇబ్న్-హిషామ్), సిరా (మహమ్మదు యొక్క జీవిత చరిత్ర), మరియు అప్పటి కవితలలో నుంచి అన్నింటినీ కూర్చి వ్రాశాడు కాబట్టి, మరియు ఇది వ్రాసి దాదాపు వంద సంవత్సరాలు దాటింది కాబట్టి మనం నిస్సందేహంగా రచయితను నమ్మవచ్చు. రచయిత పూర్తిగా నిస్సందేహంగా (దొరికినంతలో) వ్రాశాడనటానికి సాక్ష్యం. ఇది వ్రాసిన తరువాత రచయిత ఖురానులో నుంచి కొన్ని మంచి మాటలను కూర్చి ఒక చిన్న పుస్తకంగా(Minibook) రూపొందించాడు.
మహమ్మదు పుట్టుటకు ముందు అరేబియా దాని పరిసరాలగురించి కొంచెం మాట్లాడుకోవడం మంచిది. అప్పటి అరేబియాలో ఎన్నో తెగలు నివసిస్తుండేవి. అప్పటి అరేబియాలో చెప్పుకోదగ్గ పట్టణాలు రెండు. అవి మక్కా, మదీనా (అప్పటి వ్రాతలలో యాత్రిబ్ అని పిలిచేవారు). అరేబియా అత్యధికభాగం ఎడారితో కప్పబడి ఉండేది. మహమ్మదు పుట్టుకముందు కూడా అరేబియా ప్రాంతంలో చెప్పుకోదగ్గ చరిత్ర కానీ, రాజులు గానీ ఎవరూ లేరు. అరేబియావాసులగురించి చరిత్ర మీద అక్కడక్కడా కొన్ని చోట్ల కనబడేది. అరేబియాలో ఏమీ పండకపోయినా, వ్యాపారమార్గాలన్నీ ఎక్కువగా అరేబియా మీదుగా వెళ్ళేవి. అందువల్ల ఇక్కడ పండటానికి ఏమీ లేకపోయినా వ్యాపారం ద్వారా, మరియు వ్యాపారులకు సదుపాయాలు కల్పిస్తూ అరేబియా వాసులకు జీవనం జరిగిపొయేది. ఇది కాక మరొక ప్రముఖమైన ధనసహాయం మరొక విధంగా ఉండేది. మక్కాలో ఉన్న కాబా గుడికి ప్రతీ సంవత్సరం యాత్రికులు, భక్తులు వచ్చేవారు. వారిద్వారా కొంత ఆదాయం సమకూరేది. కాబాగుడిలో ప్రధాన దేవునిపేరు అల్లా. అల్లా అంటే చంద్రదేవుడు.అల్లా కాకుండా ఇంకా 360 ఇతర దేవుళ్ళ విగ్రహాలు కాబాగుడిలో వుండేవి. కాబాను విచ్చేసిన యాత్రికులు నగ్నంగా గాని, మక్కావాసులు ఇచ్చిన బట్టలు కప్పుకొని గాని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అంతేగాక జంతుబలులు కూడా జరిగేవి. ఇది మక్కాలో మహమ్మదు పుట్టుకకు ముందు పరిస్థితి.
ఈ సమయంలో మక్కాలో ఉన్న సామాజిక పరిస్థితులను ఒక్కసారి గమనిద్దాం. మక్కాలో కొరేషియా (Coreishite) , ఒమయ్యా అనేవి రెండు బలమైన వంశాలు. చరిత్రగురించి పక్కన పెట్టి ఒక్కసారి మనం దగ్గర చరిత్రను గమనిస్తే కొరేషియా వంశానికి చెందిన అబూ ముత్తాలిబ్ ను ఈజిప్టు రాజు మక్కా పెద్దగా అంగీకరిస్తాడు. అందుకు అబూ ముత్తలిబ్ కాబాగుడికి వచ్చే యాత్రికులకు సదుపాయాలను సమకూర్చాలి. అందుకు అందరూ అంగీకరించారు. అబూ ముత్తాలిబ్ తరువాత అబ్ద్ ఆల్ ముత్తాలిబ్ ఈ పనికి నియుక్తుడైనాడు. ఇతనికి పుట్టిన కొడుకలలో చిన్నవాడి పేరు అబ్దుల్లాహ్. ఈ అబ్దుల్లాహే మన మహమ్మదుకు తండ్రి. మహమ్మదు పుట్టుటకు ముందు సరిగ్గా ఆ సంవత్సరంలోనే అబిస్సీనియను దేశానికి చెందిన యెమెనును పాలించే సామంతరాజు అయిన అబ్రాహా అరేబియాను ముట్టడించాడు. అతను ఒక బలమైన ఏనుగు ఎక్కి వచ్చినందున ఆ సంవత్సరాన్ని ఏనుగుసంవత్సరమని(Year of Elephant) పిలుస్తారు. అబ్రాహా కేవలం కాబాగుడిని ధ్వంసం చేయడానికి మాత్రమే ఈ దండయాత్ర మొదలుపెట్టాడు. కాని అది పూర్తిగా విజయవంతం కాలేదు. ఖురాను ప్రకారం కొరేషియాతెగ పెద్దలు కాబా దేవుడిని మొక్కి యుద్దానికి వెళితే ఆ యుద్దంలో శత్రువులు ఎక్కువగా వ్యాధులబారినపడి మృతిచెందారు. అందుకే కాబాగుడికి ఆ సంవత్సరం బలులు ఇచ్చారు. అబ్దుల్లాహ్ కు అప్పటికే అమీనా అనే అమ్మాయితో పెళ్ళయిఉంది. అతను ఆ తెగ ఆచారలప్రకారం పెళ్ళి అయినవెంటనే మూడురోజులు అత్తవారింట గడిపి వ్యాపారం పని మీద గాజా వెళతాడు. కాని అక్కడ రోగం బారినపడి తిరిగి తనస్వంత ఊరు చేరకుండానే మృతిచెందుతాడు. అప్పటికి మహమ్మదు తన తల్లి కడుపులో ఉన్నాడు. మహమ్మదుకు అతని తండ్రి నుంచు వారసత్వంగా వచ్చిన ఆస్తి అయిదు ఒంటెలు, గొర్రెలమంద ఒకటి, ఒక బానిసఅమ్మాయి ఒమ్మ్ అయిమన్(Omm Ayman). ఒక బానిసను కలిగిఉండటం అప్పటి అరేబియా లెక్కలప్రకారం కాస్త ధనవంతులకిందే లెక్క్.
తన తండ్రి చనిపోయిన తరువాత, ఇంకా సరిగ్గా చెప్పాలంటే అబ్రాహా యొక్క యుద్దం ముగిసిన 55 రోజుల తరువాత మహమ్మదు పుట్టాడు. అనేక మంది చరిత్రకారులు ఈ సంవత్సరం 570 AD అని అంగీకరించారు కాబట్టి ఈ విషయంలో మనకు ఎట్టి సందేహం అవసరం లేదు. అప్పటి అరేబియా ఆచారాల ప్రకారం సంపన్న కుటుంబాల వారు తమ బిడ్డలకు తాము పాలివ్వరు. ఇలా పాలిచ్చేందుకు వేరే వాళ్ళకు అప్పగిస్తారు. మొదట మహమ్మదుకు థీబా(Thieuba) అనే మహిళ పాలిచ్చింది. తరువాత బాని సయిద్ కు చెందిన వారు కొంతమంది స్త్రీలు వచ్చాక కాస్త కష్టం మీద అమీనా హలీమా అనే ఒక మహిళకు మహమ్మదును ఇవ్వగలుగుతుంది. హలీమా మహమ్మదుకు తన స్వంత బిడ్డతో పాటు రెండుసంవత్సరాలు పాలిచ్చింది. తరువాత అతని తల్లి దగ్గిర వదిలి వెళ్ళింది. కాని ఈ సమయంలో ఒక చిత్రమయిన విషయం జరిగింది. మహమ్మదు ఒక్కోసారి ఆటలాడుకుంటున్న సమయంలో ఎపిలెప్సీ వల్ల ఫిట్స్ (Fit of epilepsy) వచ్చిపడిపోయేవాడు. ఇది హలీమాను కాస్త కలవరానికి గురిచేసింది. హలీమా వెంటనే అమీనా దగ్గరకు తీసుకువెళ్ళింది. అమీనా పూర్తిగా విషయం కనుక్కొని ఇందులో కంగారు పడవలసింది ఏమీలేదని చెప్పి తిరిగి హలీమాకే అప్పగించింది. ఆ విధంగా హలీమా మహమ్మదును తన బిడ్డ కన్న ఎక్కువగా ప్రేమించేది. అలా మహమ్మదుకు అయిదు సంవత్సరాలు వచ్చేదాకా పెంచిన హలీమా తిరిగి అదే రోగం మళ్ళీ ఎక్కువగా వస్తుండడంతో భయపడి అమీనాకు అప్పగించివెళ్ళింది. అమీనా ఒక సంవత్సరం మహమ్మదును పెంచిన తరువాత అతని తాత అయిన ముత్తాలిబు వద్దకు తీసుకువెళ్ళింది. కాని దారి మధ్యలోనే ఆమె కన్నుమూసింది. మహమ్మదును బానిస అమ్మాయి అతని తాతగారింటివద్ద వదిలిపెట్టింది.
అబూ ముత్తాలిబ్ తన కోడలి మరణానికి ఎంతో బాధపడ్డా తన మనవడినే కుమారుడి వలే పెంచుకొనేవాడు. ముత్తాలిబ్ మహమ్మదును ఎంతో ప్రేమగా చూసుకొనేవాడు. తనతో బాటు అన్నం తినిపించేవాడు, తన పక్కనే పడుకోబెట్టుకొనేవాడు. కానీ మహమ్మదుకు ఆ అదృష్టం ఎంతో కాలం నిలువలేదు. అతను ఎనిమిది సంవత్సరాల వయసుండగా అబు ముత్తాలిబ్ మరణించాడు. చిన్ని మహమ్మదుకు ఇది నిజంగా ఒక చేదు వార్త. అప్పటినుంచి మహమ్మదు యొక్క ఆలనాపాలనా చూసే బాధ్యత అంతా అతని పెదనాన్న అయిన అబూ తాలిబు మీద పడింది. అబూ తాలిబు ఏనాడూ మహమ్మదును బరువుగా అనుకోలేదు. తన స్వంతకుమారుడి వలే పెంచుకొనేవాడు. ఇలా కొన్నేళ్ళు గడిచాయి. ఖురాను మనకు తాలిబు యొక్క ఇతరకుటుంబ సభ్యులు మహమ్మదు ఎడల ఎలా ప్రవర్తించారో చెప్పలేదు. కాని తాలిబు చాలా పేదవాడని మాత్రం చెప్పాయి. దీనిని బట్టి తాలిబు ఇంట్లో ఆడవారు మహమ్మదును సరిగా చూడలేదని చెప్పవచ్చు కాని దీనికి ఆధారాలు మాత్రం లేవు. ఒక విధంగా మహమ్మదును అతని తాత, మరియు పెదనాన్న చాలా ప్రేమగా చూసుకొన్నా ఆడవాళ్ళసంగతి మనకు తెలియదు. వారు మహమ్మదును సరిగా చూడలేదని మనం మరో విషయాన్ని గమనిస్తే అర్థం అవుతుంది. అది మహమ్మదుకు పన్నెండు సంవత్సరాలు వయసప్పుడు జరిగిన సంఘటన. తాలిబు సిరియాకు వ్యాపారపనిమీద బయలుదేరుతుండగా హటాత్తుగా మహమ్మదు వచ్చి ఒక ఒంటె మీద ఎక్కి కూర్చుంటాడు. తాలిబు కూడా పన్నెండేళ్ళ కుర్రవాడని తెలిసికూడా సిరియాకు తనతో పాటు తీసుకువెళతాడు. కాబట్టి మహమ్మదుకు ఆడవాళ్ళనుంచి ఎక్కువ బాధలే ఉండేవని చెప్పవచ్చు. కాని మనం అతని ఇంట్లో ఆడవారిని కూడా అనలేము. అందుకు కారణం పేదరికం. సిరియా వెళ్ళిన మహమ్మదు అక్కడ ఉన్న అనేక చారిత్రక అవశేషాలను చూసి వాటి ద్వారా క్రైస్తవం మరియు యూదు మతం యొక్క చారిత్రక విశేషాలు తెలుసుకుంటాడు.
(సశేషం)
మనం ఇంతవరకు మహమ్మదు యొక్క జీవితాన్ని పరిశీలిస్తే అతను పుట్టకముందే తండ్రిని కోల్పోయాడు, ఇద్దరు తల్లులు పాలిచ్చినా కన్నతల్లి మాత్రం పాలివ్వలేదు. కన్నతల్లిని కలిసిన ఒక్క సంవత్సరంలోనే ఆమె చనిపోయింది. మొట్టమొదటి తండ్రిలాంటి వ్యక్తి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు. తరువాత మరో వ్యక్తి తండ్రిలా ఉన్నా అతని తరపున ఆడవారి ప్రవర్తన ఏమంత బాగాలేదు. ఇవి అన్నీ పుట్టిన కేవలం పన్నెండేళ్ళ కాలంలో జరిగిన సంఘటనలు. మిగతా తరువాయి టపాలో.

3 comments:

durgeswara said...

oka mahaatmuni jeevitam hcaalaa chakkagaa amdistunnaaru, remdava bhaagam kosam choostunnaamu

రాధిక said...

చాలా ఆశక్తికరం గా చెపుతున్నారు.కొనసాగించండి.

hari.S.babu said...

సార్,

మీ పోష్టులు చాలా బాగున్నాయి.జకీర్ నాయక్ గురించిన ఒక పోష్టులో మీరు అనువదించిన ప్రవక్త జీవితాని రేఖామాత్రంగా నా పోష్టులో వాడుకున్నాను.దయచేసి అన్యధా భావించకండి.మీరు ఆధారంగా తీసుకున్న పుస్తకాన్ని మళ్ళీ నేను అనువదించటం వల్ల సమయం వృధా అవుతుందని తప్ప మరో ఉద్దేశం లేదు.న అపోష్టులో మీ వ్యాసానికి లింకు ఇచ్జ్చాను.ఇక్కడ నా పోష్టు లింకు ఇస్తున్నాను.చదివి మీ అభిప్రాయం చెబితే బాగుంటుంది!

link of my post:http://harikaalam.blogspot.in/2016/07/blog-post_22.html


నమోస్తు!